Cyber Fraud Traps Wife of JD Lakshminarayana: సైబర్ మోసగాళ్ల వలలో జేడీ లక్ష్మీనారాయణ భార్య

సైబర్ నేరగాళ్ల వలలో మాజీ ఐపీఎస్ భార్య
స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో రూ.2.58 కోట్ల మోసం


స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుంచి రూ.2.58 కోట్లు కాజేశారు. 


సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా సంప్రదించి, తాము సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని ఊర్మిళను నమ్మించారు.

అనంతరం ఆమెను “స్టాక్ మార్కెట్ ప్రాఫిట్ గైడ్ ఎక్చేంజ్ 20” అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు.


ట్రేడింగ్‌పై సరైన అవగాహన లేని ఊర్మిళకు, దినేష్ సింగ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి, తాను సూచించిన విధంగా పెట్టుబడులు పెడితే 500 శాతం వరకు లాభాలు వస్తాయని నమ్మించాడు.

ఇందుకు నిదర్శనంగా కొన్ని స్క్రీన్ షాట్లు కూడా పంపించాడు.


దినేష్ సింగ్ మాటలకు బలం చేకూర్చేలా, ప్రియసఖి అనే మహిళ కూడా గ్రూప్‌లో తనకు భారీ లాభాలు వచ్చాయని స్క్రీన్ షాట్లు పోస్ట్ చేయడంతో ఊర్మిళ పూర్తిగా నమ్మింది.


ఈ నేపథ్యంలో యాపిల్ యాప్ స్టోర్ నుంచి MCKIEY CM అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఊర్మిళ, డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్యకాలంలో వివిధ దశల్లో మొత్తం రూ.2.58 కోట్లు బదిలీ చేసింది. 

ఇందుకోసం తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త జేడీ లక్ష్మీనారాయణ వద్ద ఉన్న బంగారాన్ని కూడా తనఖా పెట్టినట్లు సమాచారం.

అయితే యాప్‌లో లాభాలు చూపించినప్పటికీ, డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు ఊర్మిళ గ్రహించింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో సైబర్ నేరగాళ్లు మ్యూల్ ఖాతాలను ఉపయోగించి డబ్బులు బదిలీ చేయించినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, ఆయా ఖాతాలను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.