హైదరాబాద్: తాను ఇప్పటివరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
సెలవు తీసుకుందామని అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక పని వచ్చి పడుతోందని చెప్పారు.
సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం,
ప్రభుత్వాన్ని నడిపించేది కేవలం 200 మంది అధికారులు కాదని, 10.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులేనని స్పష్టం చేశారు.
ఉద్యోగులే ప్రభుత్వానికి సారథులు, వారధులని పేర్కొంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఉద్యోగుల్లో తనను ఇష్టపడని వారు కూడా ఉండవచ్చని వ్యాఖ్యానించిన సీఎం, తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల జీతాల పరిస్థితి ఎలా ఉందో గమనించాలని అన్నారు.
ఉద్యోగుల డీఏ దస్త్రాలపై సంతకం చేసి కార్యక్రమానికి వచ్చానని తెలిపారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రూ. కోటి బీమా కల్పించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
అలాగే ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు సుమారు రూ.12 వేల కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.
పన్నుల వసూళ్లలో అవకతవకలను అరికడితే రావాల్సిన నిధులు సమకూరుతాయని, పన్నులు పెంచాల్సిన అవసరం లేదని, సక్రమంగా వసూళ్లు చేస్తే సరిపోతుందని సీఎం అన్నారు.
జిల్లాల పునర్విభజనకు కమిటీ:
జిల్లాల సరిహద్దుల మార్పుపై పలు విజ్ఞప్తులు అందుతున్నాయని పేర్కొన్న సీఎం, జిల్లాల పునర్విభజన కోసం విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరిస్తుందని చెప్పారు.
రాచకొండ కమిషనరేట్ పేరును సహేతుకత లేకపోవడంతో మార్చినట్లు తెలిపారు.
అలాగే కొత్త జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు.