కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ.

రూ.60 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు గల్లంతు.

శ్రీకాకుళం జిల్లా, కాశీబుగ్గ:

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని **వేంకటేశ్వరస్వామి ఆలయం**లో భారీ చోరీ జరిగింది.

ఆలయ వెనుక ద్వారం ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై ఆలయ ధర్మకర్త ముకుందపండా కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.60 లక్షల విలువైన బంగారం, వెండి నగలు చోరీకి గురైనట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే కాశీబుగ్గ డీఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్, సీఐ రామకృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. 


ఆలయ పరిసరాల్లోని భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

గమనార్హమేమిటంటే, ఇదే ఆలయంలో గత నవంబర్ 1న జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే.

ఆ ఘటన అనంతరం పోలీసుల ఆదేశాల మేరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేయగా, ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.


ఈ నేపథ్యంలో జరిగిన చోరీ ఘటన కలకలం రేపింది. ఈ కేసుపై పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.