Suspicious Deaths in Meerpet: 11 నెలల కుమారుడితో పాటు తల్లి అనుమానాస్పద మృతి.

రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అనుమానాస్పద పరిస్థితుల్లో ఓ మహిళ తన 11 నెలల కుమారుడికి విషమిచ్చి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందగా, మృతురాలి తల్లి అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇన్స్పెక్టర్ శంకర్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన ఛార్టర్డ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డి, అదే ప్రాంతానికి చెందిన సుస్మిత (27)ను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. 

ప్రస్తుతం వారు హస్తినాపురం జయకృష్ణ ఎనక్లేవ్లో నివాసం ఉంటున్నారు. వీరికి అశ్వంత్ నందన్ రెడ్డి అనే 11 నెలల కుమారుడు ఉన్నాడు.

బాలుడి మొదటి పుట్టినరోజు సమీపిస్తుండటంతో రెండు రోజుల క్రితమే కుటుంబం షాపింగ్ కూడా చేసినట్లు తెలిసింది.

అయితే గురువారం ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి, సుస్మిత పడకగదిలో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉండగా, కుమారుడు మృతదేహంగా కనిపించాడు.

అదే సమయంలో సుస్మిత తల్లి లలిత (50) అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక విచారణలో సుస్మిత ముందుగా కుమారుడికి విషమిచ్చి, అనంతరం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అయితే ఆమె తల్లి అపస్మారక స్థితికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ఇదిలా ఉండగా, భర్త యశ్వంత్ రెడ్డి సుస్మితను వేధించేవాడని, బయటకు వెళ్లనీయకుండా, ఎవరికీ మాట్లాడనివ్వకుండా ఆంక్షలు విధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఘటనకు అతడే కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

భర్త వేధింపుల కారణంగానే సుస్మిత ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె పెదనాన్న సంజీవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.